సంధర్భం:
అర్జునుని కర్తవ్యముమును (క్షత్రియుడిగా యుధ్ధం చేయవలసిన తన కర్మని) స్థితప్రజ్ఞుడి లాగా చేయమని భగవాన్ శ్రీ కృష్ణుడు భోదించి నపుడు, స్థితప్రజ్ఞుడి లక్షణములు ఎలా ఉంటాయని అర్జునుడు శ్రీ కృష్ణునితో సందేహం వెళ్ళడిస్తాడు.
సమాధానముగా మనస్సుని వేధించే (ప్రలోభపెట్టే, భ్రాంతికి గురిచేసే) అన్ని స్వార్థ ప్రయోజనములగు (భగవంతుని సేవకు తప్ప) ఇంద్రియ వాంఛలను వదలి ఆత్మ జ్ఞానంలో స్థిరమయినపుడు/ ఆనందం చెందినపుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడని అంటారనీ, వీరు దుఃఖములలో కలత చెందక , సుఖములను ఆశించక మరియు మమకారము, భయము, క్రోధమును విడచిపెట్టి, సౌభాగ్యానికి సంతోషపడక మరియు కష్టాలకు కృంగిపోక పరిపూర్ణ జ్ఞానములో ఉంటారని సమాధానం ఇస్తాడు.
అలా సంపూర్ణ జ్ఞానంలో ఉండదుటకు వీరు ఒక కూర్మం (తాబేలు) ఏ విధముగానయితే అపాయం కలిగినప్పుడు బయట ఉన్న శరీర భాగాలన్నింటినీ గట్టి గల్ల అయిన రక్షణ పోర(shell) లోనికి లాగేసుకుంటుందో అలాగే స్థితప్రజ్ఞులు తమ ఇంద్రియములను వాటి భోగములనుండి మరియు వాంఛల నుండి వెనుకకు లాగేస్తూ భగవంతుని లీలల మీద గుణముల మీద కేంద్రీకరిస్తారని మనం పోయిన వారం చర్చించుకున్నాము. ఇపుడు స్థితప్రజ్ఞుల మరిన్ని లక్షణములను భగవానుడు అర్జునునికి బోధించడం మనము తెలుసుకుందాము.
60 నుండి 72 శ్లోకముల సారాంశము:
ఇంద్రియములు(ఇంద్రియములు అనుభవించ గల సుఖములు) స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనసుని చాలా సునాయాసముగా దారి మరల్చగలిగేంత బలమయినవి, అల్లకల్లోలమయినవి.
ఎవరయితే ఇంద్రియములను ఎల్లప్పుడూ వశమునందు ఉంచుకుని, మనసుని నాయందే (భగవానుని యందే) లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు (స్థితప్రజ్ఞులని అర్థము).
ఇంద్రియ సుఖముల మీద చింతన చేయటము వలన సుఖములపై మమకారం పెరిగి కోరికలకు దారి తీస్తుంది. ఈ కోరికలు తీరితే మరిన్ని పెద్ద కోరికలు కలుగుతాయి, తీరకపోతే బాధా మరియు క్రోధము (కోపము) కలుగుతాయి.
కోపము వలన విచక్షణ పోయి జ్ఞాపకశక్తి(స్మృతి) తగ్గిపోయి(మనం నేర్చుకొన్న మంచి విద్యలూ, అలవాట్లు మరచిపోయి) భ్రమ కలుగుతుంది. స్మృతి భ్రమించినపుడు బుద్ధి నశించి మనుషులు మెల్లగా పతనమవడం మొదలుపెడతారు.
ఇంద్రియ విషయములను (అనుభూతులను) వాడేటప్పుడు మనసును నియంత్రిస్తూ మమకార ద్వేషములు లేకుండా ఉన్నవారు భగవంతుని కృపకు పాత్రులవుతారు. వీరు, దుఃఖములు తొలగి శాంతి పొంది చాలా తక్కువ సమయములో బుద్ధిని భగవతునియందు నిలుపగలరు.
అలా చేయలేని వారు, మనః శాంతి లోపించినవారు సంతోషముగా ఉండలేరు.
బలమయిన గాలి అతిపెద్ద నావలను వాటి దిశ మార్చినట్టు, ఇంద్రియ సుఖములను అనుభవించాలనుకొన్న మనసు బుద్ధిని మెల్లగా క్షీణింప చేస్తుంది.
కాబట్టి అర్జునా! ఇంద్రియములను వాటి కోరికల నుండీ నిగ్రహింపగల మనుషులు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉంటారు(స్థిత-ప్రజ్ఞులయి ఉంటారు)
మనుషులు జీవితంలో సంపద, పదవులు, ఆస్తులు వారి గమ్యం అని జీవించి నపుడు, స్థితప్రజ్ఞులు మాత్రం వీటికి వ్యతిరేకమయిన రాగ ద్వేషములు లేని ఆధ్యాత్మిక జీవనం వారి గమ్యం అనుకుంటారు.
ఏ విధముగానయితే ఎన్నోనదులు తనలో కలుస్తున్నా సముద్రం చాలా ప్రశాంతముగా ఉంటుందో, స్థితప్రజ్ఞులు కోరికలను పుట్టించే చాలా వస్తువుల మధ్యలో కూడా చలించకుండా శాంతిని పొందుతారు.
ఓ పార్థా! జ్ఞానోదయం కలిగిన స్థిత ప్రజ్ఞులు మళ్ళీ ఇంద్రియముల కోరికల మాయలో పడరు. వీరు మరణ సమయంలో కూడా ఈ వివేకముతో స్థిరముగా ఉండి జనన మరణ చక్రము నుండీ విముక్తి పొంది, భగవంతుని దివ్య ధామానికి చేరుకుంటారు.
2వ అధ్యాయము (సాంఖ్యయోగము ) సారాంశము:
కురుక్షేత్ర యుద్ధంలో తన గురువయిన ద్రోణాచార్యులనూ తాత అయినటువంటి భీష్మచార్యులనూ చంపబోతున్నానని భ్రమలో ఉన్న అర్జునుడు యుధ్ధం చేయలేక భగవాన్ శ్రీకృష్ణుడిని కర్తవ్యము భోదించమని శరణు వేడుతాడు.
అపుడు శ్రీ కృష్ణుడు ఈ శరీరం, మనుషులు శాశ్వతం కాదని ఆత్మతత్త్వం గురించి భోదిస్తాడు. ఆ తరువాత ఆత్మ జ్ఞానంలో స్థితులయిన స్థిత ప్రజ్ఞుల యొక్క లక్షణమూల గూర్చి తెలియ చెబుతాడు. అలా బోధించునపుడు ఇంద్రియ అనుభూతులు(కోరికలు) మనుషులను ఎలా భగవంతుని తత్వము నుండీ దూరమయ్యి? ఎలా భ్రాంతికి గురిచేసి? బుధ్ధి నశింపచేస్తాయో? చెపుతూ స్థితప్రజ్ఞులు ఎలా ఆత్మజ్ఞానంలో స్థిరముగా ఉంటూ మళ్ళీ కోరికల మాయలో చిక్కుకోకుండా ఉంటారో బో ధిస్తాడు. ఈ వారం సారాంశము ఇంతటితో సమాప్తము.
వచ్చేవారము మనము భగవద్గీత లోని 3వ అధ్యాయమయిన కర్మయోగము గూర్చి చర్చించబోతున్నాము.
భగవద్గీత 2వ అధ్యాయము (సాంఖ్యయోగము) గూర్చి మరింత సమాచారం మరిన్ని ఉదాహరణల కొరకు Reference Book భగవద్గీత - భగవంతుని మధురవాణి స్వామి ముకుందానంద గారి వ్యాఖ్యానము 2వ అధ్యాయమయిన సాంఖ్యయోగము తప్పక చదవండి.
మీ యొక్క సందేహముల జవాబు కొరకు, మరియూ భగవద్గీతను మరింతగా అర్థం చేసుకొనుటకు ప్రతి సోమవారం నుండి శుక్రవారం 7:30AM నుండి to 8:30AM వరకూ జరిగే భగవద్గీత సంభాషణలో భాగం వహించండి. అలా వీలు కానిచో,వచ్చే వారం మా ఈ శీర్షిక కోసం ఎదురుచూడండి.
19 నుండి 59 శ్లోకముల సారాంశము కొరకు క్రింద ఉన్న లింక్స్ క్లిక్ చేయండి:
సారాంశం: JKYog India Online Class- భగవద్గీత [తెలుగు]- 15 జూలై నుండి 19 జూలై 2024 వరకు