Log in
English

భగవద్గీత దేవుని పాట - కర్మ సన్యాస్ యోగ్ - అధ్యాయం 5.16 - 5.25

Sep 21st, 2024 | 2 Min Read
Blog Thumnail

Category: Bhagavad Gita

|

Language: Telugu

సందర్భము:

క్రిందటి వారము మనము భగవద్గీత 5 అధ్యాయమయిన కర్మసన్యాస యోగములోని మొదటి 15 శ్లోకములలో కర్మయోగము మరియూ కర్మసన్యాసములలో ఏది తనకు శ్రేయస్కరమన్న అర్జునుని సందేహమునకు భగవానుని సమాధానము చదివాము.

అర్జునుని సందేహమునకు భగవానుని సమాధానము (క్లుప్తముగా):

కర్మసన్యాసమూ కర్మయోగమూ రెండూ పరమధామమును చేరుస్తాయనీ, కానీ ఈ రెండింటిలో  కర్మయోగము శ్రేష్ఠమయినదని చదివాము. 

తరువాత భక్తితో పనిచేయకుండా (దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముతో కర్మలను చేయకుండా) పరిపూర్ణ కర్మసన్యాస యోగమును చేరుకొనుట చాలా కష్టము. కానీ కర్మయోగమును దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముతో చేయువారు చాలా త్వరగా పరమధామమును పొందుతారని చదివాము. 

తరువాత అన్ని పనులయొక్క ఫలములను భగవంతునికి అర్పించువారు(కర్మయోగులు) శాశ్వతమయిన శాంతిని పొందుతారు. అలా కాక కోరికలతో తమ స్వార్థం కోసం పనిచేయువారు పాప బంధములో చిక్కుకుంటారాని చదివి చివరగా భగవంతుడు ఏ జీవి యొక్క పాప పుణ్యములలో భాగము వహించడని, తమ వివేక అజ్ఞానముచే కప్పబడటం వలన భ్రమకు లోనవుతారని తెలుసుకున్నాము.

ఈ వారము దివ్య ఆధ్యాత్మిక జ్ఞానములో ఉన్నవారి మరిన్ని లక్షణముల గూర్చి చదువుదాము.

16 నుండీ 25 శ్లోకముల సారాంశము:

ఎవరికయితే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానములో ఆత్మను గూర్చి అజ్ఞానము నశించునో వారికి చీకటి తరువాత ఒక్కసారి సూర్యోదయము అయినట్టు  చాలా త్వరగా వారికి పరమాత్మ జ్ఞానము ప్రసాదిస్తాడు.

తమ బుద్దిని భగవంతుని యందు ఉంచి సంపూర్ణముగా భగవంతునిలో నిమగ్నమయి, భగవంతుడే పరమ (ఏకైక) లక్షణమని దృఢముగా నమ్మిన వారి పాపములు  జ్ఞాన కిరణములతో నిర్మూలింపబడి అతి త్వరగా మరల పరమధామమును పొందుతారు.

అలాంటి వారు(పండితులు), ఒక బ్రాహ్మణుడిని, ఒక ఆవుని, ఒక ఏనుగుని, ఒక కుక్కని మరియూ ఒక చండాలుడునీ సమదృష్టితో భగవంతునిలో భాగముగా చూసి, ఈ జన్మలోనే జనన మరణ చక్రమును జయించి, భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉండుట వలన భగవంతుడే అన్నిటికీ మూలమనే పరమసత్యములో ఎల్లప్పుడూ స్థితులయి ఉంటారు. 

వీరు రాగ-ద్వేషాలనే భ్రమలకు గురికాకుండా యోగము ద్వారా భగవంతునితో ఒక్కటై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. 

ఓ అర్జునా! ఇంద్రియ సుఖములకు మొదలు-చివర ఉంటాయని ఇవి రాగద్వేషాలకు దారితీస్తాయని  తెలిసిన పండితులు వీటి నుండి వచ్చే ఫలితములపై ఆసక్తిని చూపక సుఖ - దుఃఖాలను సమానముగా భావిస్తారు.

ఈ శరీరమును విడిచి పెట్టక ముందే కామ - క్రోధముల నుండి పుట్టే ఉద్వేగమును అదుపు చేయగలవారు నిజమయిన సుఖసంతోషములు  గలవారు.

భగవంతుని యొక్క ఆనందమును ఆస్వాదిస్తూ,  తమలోని దివ్య ఆధ్యాత్మిక జ్ఞానములో ప్రకాశిస్తూ ఎవరయితే  ఆనందముగా ఉంటారో, వారు భగవంతునితో ఏకమయి భౌతిక ప్రాపంచిక మాయ నుండీ విముక్తులయి, భగవంతుని పొందుతారు.

ఈ వార శారాంశము ఇంతటితో సమాప్తము. 

వచ్చేవారము  మోక్షస్థితి ఎలా పొందుతారో తెలుసుకుని, 5వ అధ్యాయమయిన కర్మసన్యాసయోగమును ముగించుకుని, 6వ అధ్యాయమయిన ధ్యానయోగమును ప్రారంభము చేద్దాము

16 నుండీ 25 శ్లోకముల గూర్చి మరింత సమాచారమూ మరిన్ని ఉదాహరణాలకొరకు Reference Book   భగవద్గీత  - భగవంతుని మధురవాణి  స్వామి ముకుందానంద గారి వ్యాఖ్యానము తప్పక చదవండి.

మీ యొక్క సందేహముల జవాబు కొరకు, మరియూ భగవద్గీతను మరింతగా అర్థం చేసుకొనుటకు ప్రతి బుధవారం నుండి శుక్రవారం 7:30AM  నుండి 8:30AM  వరకు జరిగే భగవద్గీత సంభాషణలో భాగం వహించండి.  అలా వీలు కానిచో  వచ్చే వారం మళ్ళీ ఈ శిర్షికను చదవండి.


సారాంశం: JKYog ఇండియా ఆన్‌లైన్ క్లాస్- భగవద్గీత [తెలుగు]- 18 నుండి 20 సెప్టెంబర్ 2024 వరకు.

తెలుగు భగవద్గీత JKYog Online Class వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి