సంధర్భం:
ఇప్పటి దాకా మనం కురుక్షేత్ర యుధ్ధంలో భ్రాంతితో తన కర్తవ్యం నెరవేర్చలేక శ్రీ కృష్ణుని శరణు వెడిన అర్జునునికి భగవానుడు ఆత్మతత్వం గూర్చి ఆత్మతత్వం లో జీవించే స్థితప్రజ్ఞ లక్షణములు గూర్చి స్వధర్మం గూర్చి, స్వధర్మమును యజ్ఞం లాగా ఎలా నిర్వర్తించాలో బోధించడం గూర్చి చదివాము.
ఇప్పుడు నాలుగవ అధ్యాయము - జ్ఞానకర్మ సన్యాసం యోగములో భగవానుడు ఇప్పటివరకు ఈ జ్ఞానము ఇంకా ఎవ్వరికి బోధించాడో చదువుతూ అందుకు అర్జునుని ప్రతిప్రశ్న మరియు శ్రీకృష్ణుని సమాధానము మనం చదువుదాము.
1 నుండీ 3 శ్లోకముల సారాంశము:
శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునితో ఇలా పలికెను:
నేను ఈ యొక్క సనాతనమైన యోగశాస్త్రమును మొదట సూర్య భగవానుడయిన వివస్వానుడనికి బోధించితిని . అతను మనువుకి(మానవుల మూలపురుషుడు - మానవులందరూ మనువు నుండీ పుట్టినవారు), మనువు ఇక్ష్వాకునికి (భగవాన్ శ్రీ రాముడు పుట్టిన వంశమయిన ఇక్ష్వాకు వంశం యొక్క మూల పురుషుడు ) దీనిని ఉపదేశించెను.
ఓ అర్జునా! రాజర్షులయిన నిమి చక్రవర్తి మరియు దశరథ మహారాజు ఈ యోగ శాస్త్రమును పరంపరలో పొందారు (పూర్వీకుల నుండీ తెలుసుకున్నారు), కానీ కాలక్రమంలో ఆ యోగశాస్త్రము ఈ లోకంలో క్షిణించిపోయినది.
అలా క్షీణించిపోయిన/అంతరించిపోయిన ఆ యోగశాస్త్రమును నేను నీకు ఈ రోజు తెలియ చేస్తున్నాను, ఎందుకంటే నీవు నా మిత్రుడవు, భక్తుడవు మరియు ఈ అలౌకిక జ్ఞానమును అర్థంచేసుకోగలవాడవు.
4వ శ్లోక సారాంశము:
భగవానుని బోధనను విన్న అర్జునుడు తన ఈ సందేహమును వెల్లడించెను:
ఓ కృష్ణా! నీవు వివస్వనుడి తరువాత ఎంతో కాలానికి జన్మించావు. కానీ ఈ యోగ శాస్త్రమును అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి?
5 నుండీ 9 శ్లోకముల సారాంశము:
అర్జునుని సందేహమునకు భగవానుడు ఈ విధముగా సమాధానమిచ్చెను:
ఓ అర్జునా! వివిశ్వుడి కాలం నుండీ ఇప్పటిదాకా మన ఇద్దరికీ చాలా జన్మలు గడిచాయి, వాటిని నీవు మరచిపోయావూ కానీ నాకు అవి గుర్తుకు ఉన్నవి.
అలా ఎందుకు గుర్తున్నాయంటే నేను పుట్టుక లేని వాడిని, సమస్త ప్రాణులకు ప్రభువును, నాశనం లేని వాడిని. అయినా కూడా నా యొక్క యోగమాయా దివ్యశక్తిచే ఈ లోకంలో నేను అవతరిస్తుంటాను.
ఎప్పుడయితే ధర్మము క్షీణించి అధర్మము ప్రభలుతుందో అ సమయములో నన్ను నేను భూలోకములో సృజించుకుంటాను(సృష్టించుకుంటాను/అవతరిస్తాను).
ధర్మాత్ములను కాపాడుటకు, దుష్టులను నిర్మూలించటానికీ, మరియు మరుగయిన/నాశనమయిన ధర్మసూత్రములను మళ్ళీ ప్రతిష్టించుటకు(స్థాపించుటకు), ఈ లోకంలో నేను మళ్ళీ అవతరిస్తాను.
నా యొక్క జన్మ కర్మముల దివ్య స్వభావమును ఎవరయితే అర్థం చేసుకుంటారో, వారు మరల జన్మించవలసిన అవసరము లేకుండా నాయొక్క నిత్య శాశ్వత ధామమునకు చేరుకుంటారు అని పలికెను.
ఈ వార సారాంశము ఇంతటితో సమాప్తము.
వచ్చేవారము మనము మూడు రకముల కర్మలు, కర్మలు చేస్తున్నా కర్మ ఫలితం అంటని వారి లక్షణముల గూర్చి భగవానుని బోధన ద్వారా తెలుసుకుందాము.
1 నుండీ 9 శ్లోకముల గూర్చి మరింత సమాచారమూ మరిన్ని ఉదాహరణల కొరకు Reference Book భగవద్గీత - భగవంతుని మధురవాణి స్వామి ముకుందానంద గారి వ్యాఖ్యానము తప్పక చదవండి.
మీ యొక్క సందేహముల జవాబు కొరకు, మరియూ భగవద్గీతను మరింతగా అర్థం చేసుకొనుటకు ప్రతి సోమవారం నుండి శుక్రవారం 7:30AM నుండి to 8:30AM వరకూ జరిగే భగవద్గిత సంభాషణలో భాగం వహించండి. అలా వీలు కానిచో వచ్చే వారం మళ్ళీ ఇదే శీర్షికలో కలుద్దాము.
సారాంశం: JKYog India Online Class- భగవద్గీత [తెలుగు]- 14-ఆగస్ట్ to 16-ఆగస్ట్ 2024 వరకు