Log in
English

భగవద్గీత- జ్ఞాన కర్మ సన్యాస యోగం- అధ్యాయం 4.24-4.33

Aug 31st, 2024 | 1 Min Read
Blog Thumnail

Category: Bhagavad Gita

|

Language: Telugu

భగవద్గీత శ్లోక సారాంశం 4.24-4.33
సంధర్భం:

క్రిందటి వారం భగవానుని భోదన ద్వారా  4 వర్ణాలు ఎందుకు కల్పించబడ్డాయి, కర్మ అకర్మ వికర్మ అనగానేమిటో. కర్మయొక్క ఫలితము అంటకుండా ఉండడానికి భగవంతునికే ఆ ఫలితము అర్పించవలెనని, అలా అర్పించేవారిని పండితులని, ఋషులని పిలుస్తారనీ, పండితులు చేసే ప్రతి పనీ యజ్ఞంలాగా ఉంటుందని మనము చదివాము. 

24 నుండీ 33 శ్లోకముల సారాంశము:

సంపూర్ణముగా భగవంతుని ధ్యాసలో ఉన్న పండితులకు యజ్ఞములో సమర్పించు పదార్థములు మరియు ఆ  పదార్థములు సమర్పించుటకు వాడు ఉపకరణములు, యజ్ఞము చేయుటకు మనము చేసే పనులు మరియు యజ్ఞములో వాడే అగ్నికూడా బ్రహ్మమే(భగవంతుడే). ఇలా ప్రతిదానిలో (పనిలో/వస్తువులో) (రాగ ద్వేషాలు లేకుండా)  భగవంతుని చూసేవారు చాలా  సునాయాసముగా భగవంతుని పొందుతారు.

కొందరు యోగులు భౌతికమయిన వస్తువులు సమర్పిస్తూ దేవతలును పూజిస్తారు, మరికొందరు సత్యం అనే అగ్నిలో ఆత్మనే సమర్పించి భగవంతుని ఆరాధిస్తారు.

మరికొందరు శ్రవణ శబ్దాది ఇంద్రియ భోగములను, ఇంద్రియ నిగ్రహణ అనే అగ్నిలో సమర్పిస్తారు. మరి కొందరు ఇంద్రియ క్రియా కలాపములన్నింటినీ మరియు ప్రాణశక్తిని కూడా నిగ్రహించి మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. 

కొందరు సంపదని యజ్ఞముగా అర్పించగా, కొందరు కఠినమయిన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు.  మరికొందరు నిష్ఠగా వేదశాస్త్రాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవడం యజ్ఞంలా చేస్తారు. 

కొందరు శ్వాస తీసుకోవడాన్ని యజ్ఞముగా చేయగా, మరికొందరు శ్వాస వదలడాన్ని యజ్ఞముగా సమర్పిస్తారు. మరి కొందరు ప్రాణశక్తి నియంత్రణలో భాగముగా ప్రాణాయామాన్ని నిష్ఠగా చేస్తూ లోనికి వచ్ఛే మరియు బయటకు వెళ్ళే శ్వాస నియంత్రణను యజ్ఞముగా చేస్తారు. 

ఇంకా కొందరు ఆహారం తగ్గించి శ్వాసనే ప్రాణశక్తిలో యజ్ఞముగా సమర్పిస్తారు. అలా చేయటం ద్వారా తమ మలినములను శుద్ధి చేసుకుంటారు. 

ఈ విధముగా యజ్ఞము యొక్క రహస్యమును తెలిసిన వారు దానిని ఆచరించి దాని ఫలమును అమృతముతో సమానమయినదిగా (ప్రతిఫలము ఆశించక భగవంతుని ధ్యాసలో ఆచరించడమువలన) భావించి, పరమ సత్యమయిన భగవంతుని దిశలో ముందుకు వెళతారు. 

అయితే యజ్ఞము చేయని వారు, ఈ లోకములో కానీ, పరలోకములో కానీ ఎటువంటి సుఖమును పొందలేరు.

అన్ని రకముల యజ్ఞములు వేదములలో వివరించబడ్డాయి. ఇవి 4 వర్ణములు చేయబడిన పనుల నుండీ ఉద్భవించినట్టు తెలుసుకోవాలని, ఆ జ్ఞానమే భౌతిక బంధముల చిక్కు ముడులయిన మమకార-రాగద్వేషములను ఖండిస్తుందని  భగవానుడు అర్జునునికి బోధించెను.

ఓ అర్జునా! యాంత్రికముగా ద్రవ్యముతో(వస్తువులతో) చేయు యజ్ఞముకన్నా జ్ఞానముతో చేయు యజ్ఞము గొప్పది. ఎందుకంటే అన్ని యజ్ఞకర్మలూ జ్ఞానములోనే సమాప్తమవుతాయి అని బోధించెను. 

ఈ వార సారాంశము ఇంతటితో సమాప్తము.
వచ్చేవారము మనము చర్చించుకుంటున్న యోగమును/జ్ఞానమును ఎవరి నుండీ నేర్చుకొనవచ్ఛునో భగవానుడు అర్జునునికి చెప్పటము గూర్చి, జ్ఞానము యొక్క ప్రాముఖ్యత గూర్చి మరియూ ఎటువంటి వారు ఈ జ్ఞానమును ఆర్జించవచ్చొ తెలుసుకుందాం.   

24 నుండీ 33 శ్లోకముల గూర్చి మరింత సమాచారమూ మరిన్ని ఉదాహరణాల కొరకు Reference Book   భగవద్గీత  - భగవంతుని మధురవాణి  స్వామి ముకుందానంద గారి వ్యాఖ్యానము తప్పక చదవండి.

మీ యొక్క సందేహముల జవాబు కొరకు, మరియూ భగవద్గీతను మరింతగా అర్థం చేసుకొనుటకు ప్రతి సోమవారం నుండి శుక్రవారం 7:30AM  నుండి to  8:30AM  వరకూ జరిగే భగవద్గిత సంభాషణలో భాగం వహించండి.  అలా వీలు కానిచో  వచ్చే వారం మళ్ళీ ఈ శీర్షికతో కలుసుకుందాం.

సారాంశం: JKYog India Online Class- భగవద్గీత [తెలుగు]- 26 నుండి 30 ఆగస్టు 2024 వరకు.