Log in
English

భగవద్గీత దేవుని పాట, అధ్యాయం 5: కర్మ సన్యాస్ యోగ్

Sep 14th, 2024 | 2 Min Read
Blog Thumnail

Category: Bhagavad Gita

|

Language: Telugu

సందర్భం:

భగవద్గీతలోని 4వ అధ్యాయము కర్మ సన్యాసం యోగములో, కర్మను యజ్ఞములా చేయాలని తెలుసుకుని,  మానవులు యజ్ఞమును ఆచరించు పలు విధములను గూర్చి చదివాము. తరువాత యజ్ఞమును పండితులు(సదా భగవంతుని ధ్యాస లో ఉన్న వారు) ఎలా ఆచరిస్తారో చదివి, ద్రవ్యముతో చేయు యజ్ఞముకన్న జ్ఞానముతో చేయు యజ్ఞము గొప్పదన్న భగవానుని భోదనను చదివాము. యజ్ఞకర్మలన్నియూ జ్ఞానము లోనే సమాప్తమవుతాయని, కావున కర్మలన్నీ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమనే అగ్నిలో ఆహుతి చెయ్యాలని మరియు  పరమ సత్యము తెలుసుకున్న తత్వ దర్శి అయిన గురువునకు వినయమతో  సేవ చేసి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమును తెలుసుకొనడం వలన జ్ఞానోదయము అవుతుందని అలా జ్ఞానోదయము అయిన వారు మరల ఇంద్రియ వాంఛలకూ భ్రమలకు లోనుకారని చదివాము. 

ఈ వారము జ్ఞానకర్మ సన్యాసయోగము 1 నుండీ 15 శ్లోకముల సారాంశము:

సాంఖ్యయోగము , కర్మయోగము మరియు యజ్ఞము గూర్చి విన్న అర్జునుడు భగవానునితో  ఈ  విధముగా తన సందేహమును వెల్లడించెను : 

ఓ కృష్ణా, నీవు కర్మసన్యాసమును(భౌతిక జగత్తులోని కర్మలనూ/భాద్యతలనూ/బంధాలనూ) వదలుటను ప్రశంసించావు తరువాత కర్మయోగమును కూడా (భక్తితో భౌతిక జగత్తులోని కర్మలనూ/భాద్యతలనూ/బంధాలనూ వాటి ఫలితములనూ  భగవంతునికి అర్పిస్తూ)  చేయమన్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చిచెప్పుము. 

అర్జునుని సందేహమును విన్న శ్రీ కృష్ణుడు ఈ విధముగా పలికెను: 

ఓ అర్జునా! కర్మ సన్యాసమూ మరియూ కర్మయోగము రెండును మనిషి యొక్క సర్వోన్నత లక్ష్యమయిన భగవంతుని పరమధామమును చేరుటకు సహాయపడుతాయి. కానీ ఈ రెండింటిలో కర్మ యోగము శ్రేష్ఠము. 

రాగ ద్వేషములకు లోనుకాక, తాము చేస్తున్న పనులకు ఎలాంటి ఫలితము ఆశించక ఎటువంటి ఫలితమునయినా భగవంతుని దయగా భావించు కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను. వీరు భౌతిక బంధాలనుండీ సునాయాసముగా విముక్తులవుతారు. 

అజ్ఞానులుమాత్రమే కర్మసన్యాసమును మరియు కర్మయోగమును వేరని భావిస్తారు. ఈ రెండింటిలో ఏ ఒక్క మార్గమును అవలంభించినా  కూడా రెండింటి యొక్క ఫలితమునూ పొందవచ్చని యథార్థముగా తెలిసినవారు చెబుతారు. 

కర్మసన్యాసము వలన పొందగలిగే పరమ ధామమును భక్తితో కర్మలను ఆచరించుట వలన కూడా పొందవచ్చు. కావున ఈ రెండింటినీ ఒక్కటిగా చూడగలిగినపుడే ఉన్నది ఉన్నట్టుగా చూసినట్టు. 

భక్తితో పనిచేయకుండా (దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముతో కర్మలను చేయకుండా) పరిపూర్ణ కర్మసన్యాస యోగమును చేరుకొనుట చాలా కష్టము. కానీ కర్మయోగమును దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముతో చేయువారు చాలా త్వరగా పరమధామమును పొందుతారు. 

ఇటువంటి కర్మ యోగులు అన్ని ప్రాణులలోనూ పరమాత్మను దర్శిస్తారు. ఎటువంటి పనిచేసినా కర్మబంధములో చిక్కుకోరు.

కర్మయోగములో దృఢసంకల్పముతో ఉన్నవారు చూస్తున్నా, వింటున్నా, దేనినయినా తాకుతున్నా, ఎలాంటి వాసన చూస్తున్నా, కదులుతున్నా, నిద్రిస్తున్నా, ఊపిరి పీలుస్తున్నా/వదులుతున్నా, మాట్లాడుతున్నా, విసర్జిస్తున్నా, కనులు తెరుస్తున్నా/మూస్తున్నా ఎటువంటి పని కూడా చేయునది తాము కాదనీ, ప్రకృతితో చేయబడిన ఇంద్రియములే వాటి విషయములో కదలాడుతున్నవని దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముతో అర్థంచేసుకుంటారు. అలా చేయువారికి తామర పువ్వుకు బురద అంటనట్టు, పాపములచే తాకబడరు. 

కర్మయోగులు ఇంద్రియ భోగములనూ, కర్మ ఫలములో మమకార ఆసక్తినీ వదలి ఆత్మశుద్ధి కొరకు మాత్రమే ఇంద్రియములతో కర్మలను ఆచరిస్తారు. 

అన్ని పనులయొక్క ఫలములను భగవంతునికి అర్పించువారు(కర్మయోగులు) శాశ్వతమయిన శాంతిని పొందుతారు. అలా కాక కోరికలతో తమ స్వార్థం కోసం పనిచేయువారు పాప బంధములో చిక్కుకుంటారు. 

ఆత్మ నిగ్రహమూ, వైరాగ్యమూ ఉన్న జీవాత్మలు తాము ఏదీ కూడా సృష్టించడం లేదని మరియు ఏదీకూడా తమ ద్వారా జరగడంలేదని తెలుసుకుని తొమ్మిది ద్వారములు ఉన్న నగరములో (జ్ఞానకర్మేంద్రియాలున్న ఈ శరీరములో) సంతోషముగా ఉంటారు.

కర్తృత్వ భావము కానీ (నేను చేస్తున్నాను అను భావము), కర్మల స్వభావము కానీ(రాగ ద్వేషములు), కర్మఫలములు కానీ  భగవంతునిచే సృష్టింపబడవు.  భౌతిక ప్రాకృతి యొక్క గుణములు వీటన్నిటినీ సృష్టించుచున్నవి. 

భగవంతుడు ఏ జీవి యొక్క పాప పుణ్యములలో భాగము వహించడు. తమ వివేక అజ్ఞానములచే కప్పబడటం వలన భ్రమకు లోనవుతారని బోధించెను.

ఈ వార సారాంశము ఇంతటితో సమాప్తము. 

వచ్చేవారం దివ్య ఆధ్యాత్మిక జ్ఞానములో ఉన్నవారి మరిన్ని లక్షణముల గూర్చి చదువుదాము.  

01 నుండీ 15 శ్లోకముల గూర్చి మరింత సమాచారమూ మరిన్ని ఉదాహరణాల కొరకు Reference Book   భగవద్గీత  - భగవంతుని మధురవాణి  స్వామి ముకుందానంద గారి వ్యాఖ్యానము తప్పక చదవండి.

మీ యొక్క సందేహముల జవాబు కొరకు, మరియూ భగవద్గీతను మరింతగా అర్థం చేసుకొనుటకు ప్రతి సోమవారం నుండి శుక్రవారం 7:30AM  నుండి to  8:30AM  వరకూ జరిగే భగవద్గిత సంభాషణలో భాగం వహించండి.  అలా వీలు కానిచో  వచ్చే వారం మళ్ళీ ఈ శీర్షికను చదవండి.


సారాంశం: JKYog ఇండియా ఆన్‌లైన్ క్లాస్- భగవద్గీత [తెలుగు]- 9 నుండి 13 సెప్టెంబర్ 2024 వరకు.