Log in
English

భగవద్గీత- జ్ఞాన కర్మ సన్యాస యోగం- అధ్యాయం 4.10-4.23

Aug 24th, 2024 | 1 Min Read
Blog Thumnail

Category: Bhagavad Gita

|

Language: Telugu

భగవద్గీత శ్లోక సారాంశం 4.10-4.23

ఓ అర్జునా! రాగ, ద్వేష, క్రోధములకు అతీతముగా, నాయందే (శ్రీకృష్ణ భగవానుని యందే) మనసుని నిలిపి, నన్నే ఆశ్రయించిన వారు నా యొక్క జ్జ్ఞానంతో పవిత్రులయి నా దివ్యప్రేమను పొందారు. 

నాకు మనుషులు ఎంత శరణాగతి చేస్తారో నేను వారికి  అంత  స్పందిస్తాను. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరించవలసినదే.

ఈ లోకంలో, భౌతిక/లౌకిక/తాత్కాలిక  లాభాల కోసం ప్రయత్నించేవారు దేవతలను పూజిస్తారు. దేవతలు అట్టివారికి త్వరగానే కోరికలు తీరేలా వరములిస్తారు. కానీ కర్మబంధమును ఛేదించాలనుకునేవారు సర్వస్వం నాకే అర్పించి మనసు ఎల్లప్పుడూ నాయందే ఉంచి జనన మరణములు లేని నా లోకమును పొందుతారు. 

మనుషుల గుణముల ఆధారముగా నాలుగు రకముల వృత్తి ధర్మములు నాచేత సృష్టింపబడ్డాయి. సృష్టికర్త నేనే అయినా నన్ను అకర్తగా (పని చేసినా దాని ఫలితం అంటని వాడిగా) మరియు సనాతనునిగా(జననమరణములు లేని వాడిగా) తెలుసుకొనుము.

నన్ను కర్మలు అంటనివాడిగా కర్మ ఫలముల యందు ఆసక్తి లేనివాడిగా తెలుసుకున్నవారు కర్మబంధములలో  చిక్కుకోక, ప్రాచీన సమయములో మోక్షము కోరినవారు తమ కర్మలను  ఆచరించి  కర్మలయొక్క ఫలితములును నాకు పూర్తిగా అర్పించి మోక్షమును పొందారు. వారి అడుగుజాడలలో నడుస్తూ నీవుకూడా కర్తవ్యమును నిర్వర్తించుము(యుధ్ధము చేయుము). 

కర్మ మరియు అకర్మ ఏమిటన్నది తెలుసుకోలేక  వివేకవంతులు కూడా భ్రమపడుతుంటారు. ఇపుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను. ఈ రహస్యం తెలుకున్న నీవు (అర్జునుడు) భౌతిక బంధముల నుండీ విముక్తుడవు కావచ్చు.

కర్మ, అకర్మ, వికర్మ యొక్క స్వభావాన్ని నీవు తెలుసుకోవాలి. వీటి గూర్చి యథార్థం రహస్యమయినది మరియు అర్థం చేసుకోవడానికి చాలా కష్టమయినది.

ఎవరయితే అకర్మయందు కర్మను మరియు కర్మ యందు అకర్మనూ చూడగలరో వారు మానవులలో చాలా  బుధ్ధిమంతులు/ యోగులు మరియు వారి సమస్త కర్మలనూ చేయువారు. 

ఎవరి కర్మలన్నీ భౌతిక వాంఛలకు అతీతముగా ఉంటాయో మరియు తమ కర్మలన్నింటి యొక్క ఫలములు జ్ఞానాగ్నిలో ఎవరు భస్మం చేస్తారో అలాంటి వారు జ్ఞానోదయమయిన ఋషులచేత పండితులని పిలువబడతారు. ఇలాంటివారు  కర్మలు చేస్తున్నా చేయనట్టే. వీరికి కర్మలు చేయటం వలన ఎటువంటి పాపము అంటదు. వీరు చేసే ప్రతి పనీ యజ్ఞంలా ఉంటింది కాబట్టి వీరు చేసే పనులకు పాపము అంటకుండా చేయబడతారు.

ఈ వార సారాంశము ఇంతటితో సమాప్తము. 

వచ్చేవారము:

 మనుషులు తాము చేసే కర్మల ఆధారముగా యజ్ఞములు ఏ విధముగా చేయవచ్చు!  ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానముయొక్క ప్రాముఖ్యం ఏమిటి!  ఆధ్యాత్మికమయిన ప్రయాణంలో గురువు యొక్క ప్రాముఖ్యం ఏమిటి(గురువు ఏ విధముగా దిశానిర్దేశం చేయగలరు) చదువుదాము.

10 నుండీ 23 శ్లోకముల గూర్చి మరింత సమాచారమూ మరిన్ని ఉదాహరణాలకొరకు Reference Book   భగవద్గీత  - భగవంతుని మధురవాణి  స్వామి ముకుందానంద గారి వ్యాఖ్యానము తప్పక చదవండి.

మీ యొక్క సందేహముల జవాబు కొరకు, మరియూ భగవద్గీతను మరింతగా అర్థం చేసుకొనుటకు ప్రతి సోమవారం నుండి శుక్రవారం 7:30AM  నుండి to  8:30AM  వరకూ జరిగే భగవద్గిత సంభాషణలో భాగం వహించండి.  అలా వీలు కానిచో  వచ్చే వారం మళ్ళీ ఈ బ్లాగ్ ను చదవండి.


సారాంశం: JKYog India Online Class- భగవద్గీత [తెలుగు]- 19 ఆగస్టు నుండి 23 ఆగస్టు 2024 వరకు.