Log in
English

అధ్యాయం 11 - విశ్వరూప దర్శన యోగం

Jun 7th, 2025 | 2 Min Read
Blog Thumnail

Category: Bhagavad Gita

|

Language: Telugu

సందర్భము : 

భగవాన్ శ్రీ కృష్ణుని భోధన విని భౌతిక  జగత్తు మీద మోహము తొలగిన అర్జునుడు ,  భగవానుని దివ్య విశ్వరూపమును దర్శించాలని కోరుతాడని క్రిందటివారము చదివాము .  
ఈ వారము విశ్వరూప దర్శనమిచ్చిన భగవంతుడు ఎలా ఉన్నాడో, దూరదృష్టితో శ్రీ కృష్ణార్జున సంవాదము చూస్తున్న సంజయుని వివరణ చదువుదాము .  

8 నుండీ 19 శ్లోకముల సారాంశము : 

అర్జునుని విన్నపమునకు భగవానుడు ఇలా పలికెను : 
ఓ అర్జునా! నా యొక్క విశ్వరూపము దర్శించుటకు భౌతిక దృష్టి సరిపోదు. నీకు నేను దివ్య దృష్టి ప్రసాదిస్తున్నాను, ఈ దృష్టితో నా మహాద్భుతమయిన వైభవమును దర్శించుము అని పలికెను . 

దూరదృష్టితో శ్రీ కృష్ణార్జున సంవాదము చూస్తున్న సంజయుడు ఈ విధముగా పలికెను:
ఓ మహారాజా! (ద్రుతరాష్ట్రుడు), భగవంతుడు అలా పలికిన తరువాత తన దివ్యమయిన మరియూ వైభవోపేతమయిన రూపమును అర్జునునికి చూపెను .  

ఆ దివ్య విశ్వరూపములో అర్జునుడు ,  అంతములేనన్ని ముఖములూ, కన్నులూ, దివ్యాభరణములు ,  ఆయుధములూ చూసేను .  ఆ శరీరము    అనేకమూలములు కలిగి ఉండి ,  దివ్యపరిమళములు గుబాళించుచున్నది .  అనంతమయిన ఈశ్వరునిగా తన ముఖంతో శ్రీకృష్ణుడు తాను వ్యక్తపరుచుకుంటున్నాడు.
వెయ్యిమంది సూర్యులు ఒక్కసారి ప్రకాశించినా, ఆ రూపము యొక్క తేజస్సుకు సాటి రావు .  సమస్త బ్రహ్మానండములన్ని ఆ శరీరములో ఉన్నట్టు  అర్జునుడు దర్శిస్తున్నాడు .  
అలా పరమాశ్చర్యమునకు లోనయి, రోమములు నిక్కబొడుచుకున్న అర్జునుడు చేతులు జోడించి భగవంతుని ఈ విధముగా స్తుతించెను : 

ఓ కృష్ణా !  నీ దేహమునందు నేను సకల దేవతలనూ ,  ఎన్నో  ప్రాణకోటి సమూహములను ,  కమలమునందు కూర్చుని ఉన్న బ్రహ్మదేవునీ, శివుడిని మరియూ దివ్య సర్పములనూ చూచుచున్నాను.  

లెక్కించలేనటువంటి చేతులతో, ఉదరములతో ,   ముఖములతో , కళ్ళతో  అనంతమయిన రూపములను అన్నిదిశలలో చూస్తున్నాను. విశ్వమే  నీ యొక్క స్వరూపమయిన ఓ విశ్వేశ్వరా !  నీయందు నాకు ఎటువంటి మొదలూ ,  మధ్యమము మరియూ అంతమూ కనిపించుటలేదు .  
కిరీటము గధా-చెక్రాయుధములతో  నీ యొక్క స్వరూపమును దర్శిస్తున్నాను .  సూర్యునిలా అన్ని దిశలలో అగ్ని వదులుతున్న నీతేజస్సు చూడటానికి కష్టతరముగా ఉన్నది . 
నీవే నాశనము లేనట్టి పరమేశ్వరుడవని ,  వేదములచే ప్రతిపాదించబడిన పరమ సత్యమని ,  సమస్త సృష్టికి ఆధారమని ,  సనాతన ధర్మమునకు రక్షకుడవని ,  నిత్యం శాశ్వతమయిన అందరికంటే గొప్ప భగవంతుడవని తెలుసుకున్నాను.

ఆది - మధ్య - అంతములేని ,  అపరిమితమయిన శక్తులు కలిగిన , అనంత మయిన భుజములు కలిగిన, సూర్యచంద్రుల వంటి నేత్రములు కలిగిన ,  అగ్ని లాంటి నోరు కలిగిన , సమస్త సృష్టిని వెచ్చగా నీ తేజస్సుతో ఉత్తేజపరుస్తున్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నానని  అర్జునుడు పలికెను .  

ఈ వార సారాంశము ఇంతటితో సమాప్తము .  వచ్చేవారం అర్జునుడు భగవాన్ శ్రీ కృష్ణుని వివరూపములో చేసిన మరిన్ని విషయములను మనము చదువుదాము .  
8 నుండీ 11 శ్లోకముల గూర్చి మరింత సమాచారమూ మరిన్ని ఉదాహరణాల కొరకు Reference Book   భగవద్గీత  - భగవంతుని మధురవాణి  స్వామి ముకుందానంద గారి వ్యాఖ్యానము తప్పక చదవండి.
మీ యొక్క సందేహముల జవాబు కొరకు, మరియూ భగవద్గీతను మరింతగా అర్థం చేసుకొనుటకు ప్రతి బుధవారం నుండి శుక్రవారం 7:30AM  నుండి to  8:30AM  వరకూ జరిగే భగవద్గీత సంభాషణలో భాగం వహించండి. అలా వీలు కానిచో  వచ్చే వారం మళ్ళీ ఈ శీర్షికను చదవండి.

   

సారాంశం: JKYog ఇండియా ఆన్‌లైన్ క్లాస్- భగవద్గీత [తెలుగు]- 4 నుండి 6 జూన్ 2025 వరకు.