Log in
English

భగవద్గీత- సాంఖ్య యోగా- అధ్యాయం 2.19-2.30

Jun 15th, 2024 | 3 Min Read
Blog Thumnail

Category: Bhagavad Gita

|

Language: Telugu

JKYog తెలుగు భగవద్గీత ఆన్‌లైన్ క్లాస్‌లో చర్చ 2.19 నుండి 2.30 వరకు శ్లోకాలను కవర్ చేస్తుంది.

సంధర్భము:
కురుక్షేత్ర యుద్ధమునందు తన విలువిద్యా నైపుణ్యముతో మరియు శౌర్య పరాక్రమములతో శత్రువులపై విజయం సాధించవలసిన అర్జునుడు, తన తాత అయినటువంటి భీష్మాచార్యులు   మరియు పూజ్య గురువు అయినటువంటి ద్రోణాచార్యుల మీద ఆయుధం ఎక్కుపెట్టడం ధర్మముకాదని కాదని భ్రమతో విషాధం చెంది, తన కర్తవ్యం తెలుసుకోలేని అయోమయ స్థితినందు భగవానుడు అయినటువంటి శ్రీ కృష్ణుడిని కర్తవ్యం భోదించమని శరణు వేడుతాడు.

ఆ సంధర్భమున శరణాగతుడయిన  పార్థునికి వాత్సల్యముతో భగవానుడు  తాను చూస్తున్న మనుషులు(దేహములు-శరీరములు) అశాశ్వతమైనవని, శరీరమునకు చైతన్యం ఇచ్చునది ఆత్మ అని, ఆత్మ యొక్క ఉనికి మరియు లక్షణములను భగవద్గీత 2వ అధ్యాయము 17 నుండి 25వ శ్లోకములలో చేసిన ఉపదేశము మనము చదువుచున్నాము. 

17 మరియు 18 శ్లోకముల సారాంశము: 
శరీరమంతయు వ్యాపించి ఉన్ననూ ఆత్మ నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. అనశ్వరమయిన ఆత్మను ఎవ్వరూ కూడా నశింపచేయలేరు. మరణకాలములో ఈ భౌతిక శరీరము మాత్రమే నశించున్నది, అందున్న జీవాత్మ నాశనరహితమయినది. కొలువశక్యము కానిది మరియు నిత్యశాశ్వతమయినది కావున, ఓ భరతవంశీయుడా యుధం చేయుము అని భగవాన్ శ్రీ కృష్ణుడు అర్జునునితో పలికెను.

19 నుండి 21 శ్లోకముల సారాంశము: 
  • ఆత్మ ఇతరులను చంపుననియు మరియు ఆత్మ ఇతరులచే చంపబడుననియు భావించువారు ఇరువురు అజ్ఞానులు. 
  • ఆత్మ ఎవ్వరిని చంపదు మరియు ఎవ్వరి  చేతను చంపబడదు. ఆత్మకు పుట్టుక లేదు మరియు ఎన్నటికీ మరణం కూడా ఉండదు. 
  • ఈ విశ్వమంతటా  ప్రయాణించగల ఆత్మ నాశనం లేనిది, దానిని ఎవ్వరు అంతం చేయలేరు. 
  • ఆత్మ జన్మలేనిది, నిత్యమయినదీ, శాశ్వతమైనదీ మరియు వయోరహితమైనది. శరీరం నుండి విడిపోయినప్పుడు కూడా అది నశించదు. 
  • ఓ పార్థా : ఆత్మ నాశనం చేయబడలేనిదని , చావుపుట్టుకలు లేనిదనీ, శాశ్వతమైనదనీ  తెలుసుకొన్నవారు ఎవ్వరినైనా ఎలా చంపుతారు? మరియు ఎలా చంపిస్తారు?

ఉదాహరణ:
మన నిద్రలో ఉన్నప్పుడు శరీరానికి దెబ్బ తగిలినట్లు కలగంటే, ఆ అనుభూతి  మనం నిద్ర మేలుకొనువరకు  మాత్రమే ఉన్నట్టు, మనం ఈ భౌతిక శరీరం అని అనుకోవటం వలన మరణము అనే భ్రాంతి కలుగుతుంది. 

జ్ఞానోదయం అయిన వారికి మాయ తొలగి పోయి మరణం యొక్క భయం నశిస్తుంది.

ఆత్మ శాశ్వతం మరియు శరీరం అశాశ్వతం కాబట్టి, మనం ఈ శరీరం అనే భ్రాంతిని వదలి అర్జునుడు భీష్మ ద్రోణులను సంహరించడం భ్రాంతి అని గ్రహించి యుద్ధము చేయమని శ్రీ కృష్ణ భగవానుడు భోదించుచున్నాడు


22 నుండి 25 శ్లోకముల సారాంశము: 
మానవుడు చిరిగిపోయిన పాతబట్టలను వదిలి కొత్త బట్టలు వేసుకొనునట్లు, ఆత్మ కృశించిన శరీరమును వదలి కొత్త దేహమును పొందును, అనగా మరణ సమయమున జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త  శరీరమును స్వీకరించును.  ఈ ఆత్మను ఆయుధములు విభజించలేవు-విచ్చిన్నం చేయలేవు. అగ్ని వలన ఆత్మ దహింపబడదు, నీటి వలన తడపబడదు, గాలి ఎండ పెట్టలేనిది.

ఆత్మ నిత్యమయినది, సర్వవ్యాప్తమయినది, శాశ్వతమయినది, చలనరహితమయినది, సనాతనమయినది, అనునిత్యం అంతటా ఉండునది .  ఆత్మ జ్ఞానేంద్రియములకు గోచరము కానటువంటిది, అవ్యక్తమయినది, వ్యూహాతీతమయినది మరియు మార్పులేనిది.

"ఆత్మ యొక్క తత్త్వం తెలుసుకొన్న నీవు అశాశ్వతమయిన శరీరంకొరకు శోకింప తగదు" అని     శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను.  

26 మరియు 27 శ్లోకముల సారాంశము:
ఓ మహా బాహువులు కలవాడా! (అర్జునా), ఒక వేళ నీవు ఆత్మ జనన మరణములకు లోనగునని భావించినను, ఇలా శోకించుట తగదు (26వ శ్లోకము  సమాప్తము ), ఎందుకనగా  పుట్టినవారికి మరణము తప్పదు మరియు మరణించినవారికి పుట్టుక తప్పదు. కావున అనివార్యమయినటువంటి ఈ జనన మరణములను గూర్చి నీవు శోకింప తగదు (27వ శ్లోకము  సమాప్తము ).

స్పష్టీకరణ:
25వ శ్లోకము వరకు ఆత్మకు జనన మరణములు లేవని బోధించిన భగవానుడు, 26వ శ్లోకము నందు అర్జునునితో "ఒక వేళ నీవు ఆత్మ జనన మరణములకు లోనగునని భావించినను" అని సంభోదించుటకు గల కారణం ఏమిటి అని సందేహం కలిగితే, 

ఆత్మతత్త్వం గురుంచి మహాభారత సమయములో ప్రాచుర్యంలో ఉన్న మరేదైనా సిద్ధాంతం అర్జునుడు నమ్ముతున్నాడేమోనని భగవానుడు ఈ శ్లోకం భోదించెనని అర్థం చేసుకోవాలి.

29 నుండి 30 శ్లోకముల సారాంశము:
శరీరమంతయు వ్యాపించి ఉన్ననూ ఆత్మ నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. అనశ్వరమయిన ఆత్మను ఎవ్వరూ కూడా నశింపచేయలేరు. మరణ సమయమున  ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది, అందున్న జీవాత్మ నాశనరహితమయినది. కొలువశక్యము కానిది మరియు నిత్యశాశ్వతమయినది కావున, ఓ భరతవంశీయుడా యుధం చేయుము అని భగవాన్ శ్రీ కృష్ణుడు అర్జునునితో భోదించెను. 

ఓ భరతవంశీయుడా!సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టక మునుపు అవ్యక్తములు, జీవితకాలములో వ్యక్తములు మరియు మరణించిన పిదప మరల అవ్యక్తములు. కావున శోకించుట ఎందునకు?

సూచన:
ఈ శ్లోకమును మరింతగా అర్థం చేసుకోవడానికి స్థూల, సూక్ష్మ మరియు కారణ శరీరముల గురించి అధ్యయనం చేయండి. (Reference Book:  భగవద్గీత  - భగవంతుని మధురవాణి  స్వామి ముకుందానంద గారి వ్యాఖ్యానము)

కొందరు ఈ ఆత్మను ఆశ్చర్యకరమయినదిగా వీక్షిస్తారు, మరి కొందరు ఆశ్చర్యకరమయినదిగా వర్ణిస్తారు, మరియు  కొందరు ఆశ్చర్యకరమయినదిగా వింటారు. మరి కొందరు విన్నా కూడా అర్థం చేసుకోలేరు. 

ఓ అర్జునా! దేహమునందు ఉన్న ఆత్మ చావు లేనిది కావున నీవు ఏ ప్రాణి గూర్చియూ శోకింపతగదు.

సారాంశం: JKYog India Online Class- భగవద్గీత [తెలుగు]- 10 జూన్ నుండి 14 జూన్ 2024 వరకు