Log in
English

భగవద్గీత- సాంఖ్య యోగా- అధ్యాయం 2.31-2.46

Jun 29th, 2024 | 3 Min Read
Blog Thumnail

Category: Bhagavad Gita

|

Language: Telugu

సంధర్భము:
16 నుండి 30 శ్లోకములలో కృష్ణభగవానులు, అర్జునునితో తాను అనుకొంటున్నట్టు మన ఉనికి  అశాశ్వతమయిన  ఈ శరీరం కాదని, సనాతనమయిన ఆత్మ అని భోదించి. మరణం శరీరానికి కానీ ఆత్మకు కాదనీ, ఆత్మ ఎవ్వరిచేతా చంపబడనిదీ,  కొలువశక్యం కానిదీ,  విభజించలేనిదనీ మరియూ మనిషి చిరిగి పోయిన బట్టలను త్యజించినట్టు  ఆత్మ జీవం లేని శరీరమును త్యజించును కావున, అర్జునుడు భీష్మ-ద్రోణులను యుద్ధంలో చంపడం ఒక్క భ్రమ మాత్రమేనని తేల్చి చెప్పెను. 

31 నుండి 33 శ్లోకముల సారాంశము:
ఓ అర్జునా! నీయొక్క  క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు యుద్ధముచేయుటకు వెనుకాడరాదు.  క్షత్రియులకు ధర్మపరిరక్షణకొరకు యుద్ధం చేయుటకన్నను మించిన కర్తవ్యము లేదు. 

ధర్మమును పరిరక్షించే అవకాశము కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు చాలా అదృష్టవంతులు. అటువంటి అవకాశము వారికి  తెరిచిన స్వర్గద్వారమువంటిది.

స్వధర్మమును, కీర్తినీ విడచి ధర్మయుధ్దమును  చేయకపోవట  పాపము చేయుటతో సమానమని హితవు పలికెను.

ధర్మము రెండు రకములు. ఆత్మ ధర్మము మరియు శారీరక ధర్మము.

ఆత్మ ధర్మము: చక్కెర  యొక్క స్వభావము తీపి మరియు నిప్పు యొక్క స్వభావము వేడి  అటులనే మన ఆత్మ యొక స్వభావము/ సహజ ధర్మము భగవంతునికి సేవ చేయటమే. 

శారీరిక ధర్మము: ఇది శరీరం  యొక్క వర్ణాశ్రమము మీద ఆధారపడి ఉండును. మనిషిని సమాజంతో ఏకంచేసి వ్యక్తిగత మరియు సమాజ అవసరాలను ఈ యొక్క ధర్మం సమన్వయం చేస్తుంది. 

34 నుండి 38 శ్లోకముల గూర్చి చర్చించుకొనునప్పుడు   మునుపు అర్జునుడి యొక్క గొప్పతనము తెలుసుకొనుట అవసరము. 

అర్జునుడు మహా యోధుడు మరియు కర్ణ భీష్మ ద్రోణాచార్యులకు పోటీ ఇవ్వగల ప్రత్యర్థి. ఎంతో మంది దేవతలతో యుధ్ధం చేసి మెప్పు పొందడమే కాక వేటగాడిలా మారు వేషం లో వచ్చిన మహా శివునితోకూడా పోరాడి మెప్పించి పాశుపతాస్త్రం అనే దివ్యాస్త్రమును బహుమానంగా పొందినవాడు. అర్జునుడి విలువిద్యను మెచ్చిన గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు బ్రహ్మశీర్షాస్త్రముతో  దీవించాడు.

యుధ్ధరంగంలో అర్జునుడి భ్రమ పోగొట్టుటకు భగవానుడు క్రింది విధముగా పలికెను.     

34 నుండి 39 శ్లోకముల సారాంశము:
జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడని అందురు. గౌరవప్రదమయిన నీకు ఈ అపకీర్తి మరణముకన్నా నీచమయినది.

ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారి చేతనే యుద్దమునుండి పారిపోయినవాడివని పిలిపించుకుని వారి మీద నీకున్న గౌరవం పోగొట్టుకొనెదవు. 

నీ శత్రువులు నిన్ను క్రూరమయిన  మాటలతో అవమానించి నీ గొప్పతనమును చులకన చేయుదురు. దీనికంటే బాధాకారమయినటువంటిది ఏదయినా ఉన్నదా!

ఓ కుంతీపుత్రా! యుధ్ధములో మరణించినచొ స్వర్గప్రాప్తి  లాభించును, విజయుడివి అయినచో రాజ్యం ప్రాప్తించును. కావున కృతనిశ్చయముతో యుధ్ధమునకు సిధ్ధముకమ్ము.  

సుఖ-దుఃఖములను, లాభనష్టములను సమానముగా తీసుకుంటూ కర్తవ్యమును నిర్వర్తించుము (యుధ్ధము చేయుము). ఈ విధముగా నీ భాద్యతలను నిర్వర్తించినచో నీకు పాపము కలుగదు అని కర్తవ్యమును బోధించెను.

ఇప్పటి దాకా నేను నీకు సాంఖ్య యోగము అంటె, ఆత్మ తత్త్వం  గూర్చి  విశ్లేషణాత్మక జ్ఞానమును వివరించితిని.

ఓ పార్థా! ఇప్పుడు నేను నీకు బుద్ధి యోగము గూర్చి విశదీకరించెదను. ఈ అవగాహనతో పని చేయునపుడు నీవు కర్మ బంధమునుండి విముక్తి పొందెదవు. 

అదనపు సమాచారము:
సాంఖ్య యోగము నుండి బుద్ధి యోగమునకు సంభాషణలో ఈ మార్పు ఎందుకని సందేహం కలిగినట్లయితే. అర్జునుడు భ్రమలో ఉంది  ఈ లోకం మరియు మనుషులు అశాశ్వతం అని మరచి తన కర్తవ్యము నెరవేర్చలేని  సంధిగ్ధంలో ఉన్నాడు కాబట్టి, జగత్పరిపాలకుడయిన మరియు కూరుక్షేత్రంలో అర్జునుడికి గురువు అయినటువంటి శ్రీ కృష్ణభగవానుడు బుధ్ధి యోగం సమంజసం అని భావించెనని అర్థంచేసుకోవలెను.

సాంఖ్యయోగం ద్వారా మోక్షం లభించుట చాలా దుర్లభము. సకల ఐశ్వర్యములు భౌతిక సుఖములు చూసినటువంటి గౌతమబుద్ధునకు 7 సంవత్సరముల ధ్యానము తరువాత ఈ స్థితి లభించినది. 

వివిధ ఆచార్యులు దేశకాల పరిస్థితుల ఆధారంగా ఆత్మ తత్వాన్ని విభిన్నంగా వివరించిరి. 

పైన చెప్పిన విషయాలన్నీ సైద్ధాంతికం, మనం నిరంతరం సైద్ధాంతిక జ్ఞానాన్ని గూర్చి  ధ్యానించినప్పుడే ఆచరణాత్మక జ్ఞానం వస్తుంది.

జ్ఞానము శాబ్దిక మరియు అనుభవాత్మక మయినది. దీనికి  మంచి ఉదాహరణ బొగ్గు మరియు వజ్రము. శతాబ్దాలు మరియు సహస్రాబ్దాలుగా అపారమైన ఒత్తిడి మరియు వేడిలో ఉన్న బొగ్గు వజ్రముగా  మారుతుంది

సైద్ధాంతిక జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా మార్చడానికి, సాధన అవసరం. కాబట్టి మనం ధ్యానం చేయాలి, సేవ చేయాలి మరియు మంచి వ్యక్తుల సహవాసంలో ఉండాలి (సత్సంగంలో ఉండాలి)

40 నుండి 46 శ్లోకముల సారాంశము:
ఈ ధృక్పదముతో (కర్మ యోగములో) పనిచేయునపుడు, ఎలాంటి నష్టముకానీ వ్యతిరేక ఫలములు కానీ కలుగవు. కొద్దిగా సాధన చేసినా మనలను పెద్ద ప్రమాదముల నుండీ కాపాడును.

కర్మయోగములో ఉన్నవారి బుద్ధి స్థిరముగానుండును, కానీ కర్మయోగములో  లేనివారి బుద్ధి చంచలము గా ఉండును. 

కర్మయోగము గూర్చి పరిమితమయిన అవగాహనగలవారు తమకు ఇంద్రియ సుఖములను ప్రాప్తిమ్పచేసే కార్యములను మాత్రం  వేదముల పరిపూర్ణ అవగాహన లేకొండా ఐశ్వర్య ప్రాప్తి, ఇంద్రియ భోగములు, ఉన్నత జన్మ మరియూ స్వర్గలోక ప్రాప్తి కోసమని ఆడంబరమయిన కర్మకాండలు చేయుచుంటారు.

ఇందువలన భగవదప్రాప్తి పథములో సాఫల్యానికి కావలసిన ధృఢసంకల్పాన్ని వారు కలిగి ఉండరు.

ఓ! అర్జునా వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మికమయిన విషయములను వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతముగా స్వచ్చమయిన ఆధ్యాత్మక స్థితిలో ఆత్మభావనయందే స్థితుడవై ఉండుము.

ఏవిధముగానయితే చిన్న నీటి బావిలో తీరే అన్ని ప్రయోజనములు పెద్ద నీటి కొలనులో కుడా కలుగునో అదే విధముగా పరమసత్యమును ఎరిగి భగవత్ప్రాతి  పొందినవారు అన్ని వేదముల లక్ష్యములను నెరవేర్చుదురు. 

సూచన:
త్రిగుణముల గూర్చి వీటి వలన కలుగు ద్వంద్వముల గూర్చి, వేదముల యొక్క పరిచయం కొరకూ మరియూ వేదములకు భగవద్గితకు మధ్య సంభందము తెలుసుకొనుటకు Reference Book   భగవద్గీత  - భగవంతుని మధురవాణి  స్వామి ముకుందానంద గారి వ్యాఖ్యానము 2వ అధ్యాయమయిన సాంఖ్యయోగము యొక్క 45 మరియు 46వ శ్లోకములు  తప్పక చదవండి.

వచ్చేవారం:
కృష్ణభగవానుడు ఇప్పటి దాకా చెప్పినట్టు ఆత్మతత్వం అర్థం చేసుకొనే బాటలో స్వధర్మాన్ని అనుసరిస్తే మనలో ఎలాంటి మార్పులు వస్తాయి? అలా చేయడం వలన మనం భగవానుడి నుండి ఏమి ఆశించవచ్చు?

భగవానుడి చే ఆత్మతత్వం ప్రత్యక్షంగా భోదించ బడిన అర్జునుడిలో  ఎలాంటి మార్పు వచ్చింది. అర్జునుడికి  ఎలాంటి సందేహములు కలిగాయి!

ఇలాంటి సందేహముల జవాబు కొరకు, మరియూ భగవద్గీతను మరింతగా అర్థం చేసుకొనుటకు ప్రతి సోమవారం నుండి శుక్రవారం 7:30AM  నుండి to  8:30AM  వరకూ జరిగే భగవద్గిత సంభాషణలో భాగం వహించండి.  అలా వీలు కానిచో  వచ్చే వారం మళ్ళీ ఈ బ్లాగ్ ను చదవండి. 
                                                                                                                                                                                                                             
సారాంశం: JKYog India Online Class- భగవద్గీత [తెలుగు]- 24 జూన్ నుండి 28 జూన్ 2024 వరకు