ఆత్మతత్వం గూర్చి మరియు స్వధర్మం గురించి భగవాన్ శ్రీ కృష్ణుని భోదన మనం 2వ అధ్యాయంలో చర్చించాము. ఇపుడు 3వ అధ్యాయంలో అర్జునునికి ఆత్మతత్వం మరియు స్వధర్మము మీద కలిగిన సందేహములు మరియు భగవాన్ శ్రీ కృష్ణుని జవాబు గూర్చి చర్చిద్దాం.
సూచన: 2వ అధ్యాయంలోని (సాంఖ్యయోగము) శ్లోకముల సారాంశము కొరకు క్రిందటి లింక్స్ క్లిక్ చేయండి / వినియోగించండి.
1 మరియు 2వ శ్లోకముల సారాంశము(అర్జునుని సందేహములు):
ఓ! జనార్దనా, సాంఖ్యయోగమును అనుసరించి స్థితప్రజ్ఞుడిలా ఆత్మజ్ఞానంలో ఇంద్రియ భోగములకు దూరముగా ఉంటూ, జీవితములో కోరికల మాయలో పడకుండా వివేకముతో స్థిరముగా ఉన్నా వ్యక్తి జనన మరణ చక్రము నుండి విముక్తి పొందిన వ్యక్తి భగవంతుని దివ్య ధామమునకు చేరుకుంటాడని నీవు భొదించావు, కానీ స్వధర్మమును అనుసరించి ఘోరమయిన యుద్ధం ఎందుకు చేయమంటున్నావూ?
ఈ అస్పష్టమయిన ఉపదేశముతో నాకు చాలా అయోమయం కలుగుతున్నది. సాంఖ్య మరియు కర్మయోగములలో నాకు ఏది మంచిదో ఉపదేశించుము అని సందేహమును వెల్లడించెను.
3 నుండి 10వ శోకముల సారాంశము (అర్జునుని సందేహములకు భగవాన్ శ్రీ కృష్ణుని సమాధానము):
ఓ పార్థా! భగవత్ ప్రాప్తికి రెండు మార్గములు గలవు. అవి 1)సాంఖ్యయోగము(ధ్యాన మార్గము - ధ్యాన నిష్ఠలో ఆసక్తి ఉన్నవారికి) 2) కర్మయోగము (కర్మ మార్గము - పనుల పట్ల ఆసక్తి ఉన్నవారికి).
మనుషులు కర్మను ఆచరించకుండా కర్మబంధము నుండి విముక్తి పొందలేరు, మరియు భౌతిక పనుల నుండి సన్యాసము తీసుకున్నంత మాత్రాన జ్ఞాన సిద్ధిని పొందలేరు సరికదా కర్మను ఆచరించకుండా ఒక్క క్షణము కూడా ఉండలేరు.
అన్ని ప్రాణులు వాటి యొక్క ప్రాకృతిక (సహజ) స్వభావములయిన త్రిగుణముల ప్రభావము వలన కర్మను చేయక తప్పదు.
కర్మేంద్రియములను అదుపులో ఉంచినా మనసులో మాత్రం ఇంద్రియ భోగాల గూర్చి ఆలోచిస్తూనే ఉండేవారు తమని తాము మోసం చేసుకున్నట్టు అవుతుంది. వీరు కపటులు అని పిలువబడతారు.
కానీ తమ జ్ఞానేంద్రియములను మనసుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండ పనిచేసే కర్మయోగులు నిజంగా చాలా శ్రేష్ఠులు.
కావున నీవు వేదములలో సూచించినట్టు కర్తవ్యమును నిర్వర్తించాలి, ఎందుకంటే కర్తవ్య నిర్వహణ, పనులు ఇష్టం లేకుండా సన్యాసం తీసుకోవడం కన్నా మంచిది. కర్తవ్య నిర్వహణ చేయకపోవడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు.
కర్తవ్యమును ఒక యజ్ఞం లాగా భగవంతునికి అర్పిస్తూ చేయాలి. అలా చేయకపోతే అవే పనులు మనుషులను కర్మబంధంతో కట్టి వేస్తాయి.
కాబట్టి అర్జునా! నీకు అప్పగించిన పనులను/విధులను/కర్తవ్యమును వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా భగవంతుని తృప్తి కోసం చేయుము.
సృష్టి ప్రారంభములో బ్రహ్మ దేవుడు, మానవ జాతిని విధులతో సృష్టించి ఇలా చెప్పాడు "ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వృద్ధి చెందండి. ఇవి మీ సమస్త కోరికలను తీరుస్తాయి"
ఈ వారం సారాంశం ఇంతటితో సమాప్తము.
వచ్చేవారము:
యజ్ఞము అంటే ఏమిటో మరియు యజ్ఞమును ఆధ్యాత్మిక మనస్సు ఉన్న సత్పురుషులు ఎలా చేస్తారు! మరియు తమ కర్మలను వేదాలను అనుసరించి నిర్వర్తించి భగవత్ప్రాప్తి పొందిన సత్పురుషుల గూర్చి చర్చించుకొందాము.
గూర్చి మరింత సమాచారం మరిన్ని ఉదాహరణల కొరకు Reference Book భగవద్గీత - భగవంతుని మధురవాణి స్వామి ముకుందానంద గారి వ్యాఖ్యానము తప్పక చదవండి.
మీ యొక్క సందేహముల జవాబు కొరకు, మరియు భగవద్గీతను మరింతగా అర్థం చేసుకొనుటకు ప్రతి సోమవారం నుండి శుక్రవారం 7:30AM నుండి to 8:30AM వరకూ జరిగే భగవద్గీత సంభాషణలో భాగం వహించండి. అలా వీలు కానిచో వచ్చే వారం మళ్ళీ ఈ బ్లాగ్ ను చదవండి.
సారాంశం: JKYog India Online Class- భగవద్గీత [తెలుగు]- 22 జూలై నుండి 26 జూలై 2024 వరకు