సంధర్భము:
కర్మయోగము గూర్చి గతవారము చదువుతూ , ఇంద్రియభోగములు మనుషులను ఎలా కర్మబంధములో పడేస్తాయో చదివి, కర్తవ్యములను/కర్మలను యజ్ఞములాగా చేయాలని తెలుసుకున్నాము. ఇపుడు ఆ యజ్ఞం అంటే ఏమిటో, అది ఎలా చేయాలో చదువుతూ
స్థితప్రజ్ఞుజ్ఞులు/జ్ఞానులు యజ్ఞమును ఎలా చేస్తారో తెలుసుకుందాము. తరువాత ఆ యజ్ఞములు వేదాలలో సూచించినట్టు చేస్తూ పరమాత్మను చేరుకున్న వారి గూర్చి ఇపుడు చదువుదాము.
గతవారము మనం చర్చించుకున్న విషయముల గూర్చి క్రిందటి లింక్లో మనం మరొక్కసారి చదువవచ్చు:
11 నుండీ 16 శ్లోకముల సారాంశము:
మనుషులు చేసిన యజ్ఞముల వలన తృప్తి పొందిన దేవతలు, జీవన నిర్వహణకు కావాలసిన అన్నింటినీ ప్రసాదిస్తారు. తమకు ప్రసాదించబడిన దానిని తిరిగి దేవతలకు నివేదించకుండా(భగవంతుని సంతోషం కోసం వేదముల ప్రకారం ఉపయోగించక) తామే అనుభవించువారు దొంగలు అని శ్రీ కృష్ణ పరమాత్ముడు బోధించెను.
అలా భగవంతునికి సమర్పించిన తరువాత మిగిలిన ఆహారమును/ధనమును/సమయమును వినియోగించేవారు అన్ని పాపములనుండి మరియు కర్మబంధములనుండీ విముక్తులవుతారు. ఇలా చేయనివారు పాపమును చేసినట్టేనని శ్రీ కృష్ణ పరమాత్ముడు బోధించెను.
అన్ని ప్రాణులూ ఆహారం వల్లనే జీవిస్తాయి, ఆహారం వర్షములు వలన పండుతుంది/తయారవుతుంది. వానలు యజ్ఞం చేయుట వలన కురుస్తాయి మరియు మనుషులకు వేదములలో నిర్దేశించబడిన పనులు/కర్తవ్యములు చేయటం వలన యజ్ఞము జనిస్తుంది(చేయబడుతుంది).
మానవ కర్మలు నిర్దేశించే వేదములు, భగవంతునినుండే వ్యక్తమయ్యాయి(పుట్టుకువచ్చాయి), కాబట్టి వేదాల అనుగుణంగా చేసే పనులలో భగవంతుడు స్థితుడయి ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి.
వేదములచే నిర్దేశింపబడిన(చెప్పబడిన) ఈ యజ్ఞ చక్రములో తమకు ఉద్దేశింపబడిన పనులను చేయనివారు పాపులు. అలా తమ ఇంద్రియ భోగముల కోసమే బ్రతికేవారి జీవితమూ వ్యర్థము అని బోధించెను.
సాధారణముగా కలిగే ఒక సందేహం:
మనుషులు అందరూ వేదాలలో సూచించినట్టు పనులు చేయవలసినదేనా, లేక ఎవరికయినా మినహాయింపు ఉన్నాదా!
ఈ విషయం గూర్చి శ్రీ కృష్ణభగవానుడు ఏమని భోదించాడో ఇపుడు మనం చదువుదాము.
17 నుండీ 20 శ్లోకముల సారాంశము:
కానీ ఎవరయితే పరిపూర్ణ ఆత్మజ్ఞానంలో సంతుష్టులుగా ఉంటారో వారికి ఎలాంటి కర్తవ్యములు(పనులు) ఉండవు మరియు వీరు తమ పనులను చేయటం లేదా చేయకపోవటం వలన వీరికి లాభ-నష్టములు ఉండవు/కలుగవు. అలాంటి వారు తమకోసం ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరము ఉండదు.
కాబట్టి ఇష్టమూ అయిష్టములను వదలి ఇంద్రియ భోగములలో ఆసక్తి లేకుండా కర్తవ్యమును నిర్వర్తింపుమని చెప్పి అలా చేసినవారు పరమాత్మను చేరుకోగలరని బోధించెను.
సాధారణముగా కలిగే మరొక్క సందేహం:
పైన భోదించినట్టు ఇష్టమూ అయిష్టములను వదలి ఇంద్రియ భోగములలో ఆసక్తి లేకుండా కర్తవ్యమును నిర్వర్తించి పరమాత్ముని చేరినవ్యక్తులు ఎవరయినా ఉన్నారా అనే సందేహమునకు భగవానుడు చెప్పిన సమాధానము ఇప్పుడు మనం చదువుదాము.
20 నుండీ 26 శ్లోకముల సారాంశము:
జనక మహారాజు వంటి వారు ఇష్టమూ అయిష్టములను వదలి ఇంద్రియ భోగములలో ఆసక్తి లేకుండా కర్తవ్యమును నిర్వర్తించి పరమాత్ముని చేరుకున్నారని. ప్రపంచానికి మంచి ఆదర్శం చూపడానికి ఓ అర్జునా! నీవూ నీ కర్తవ్యమును ఇష్టమూ అయిష్టములను వదలి ఇంద్రియ భోగములలో ఆసక్తి లేకుండా నిర్వర్తించుము. గొప్పవారు చేసే పనులను సామాన్య ప్రజలు అనుకరిస్తారు (అనుసరిస్తారు). అలాంటి వారు నెలకొల్పిన ప్రమాణాన్ని ప్రపంచమంతా అనుసరిస్తారు.
ఈ మూడు లోకములలో నేను(కృష్ణ భగవానుడు) చేయవలసిన కర్తవ్యము కానీ, పొందవలసినది కానీ, సాధించవలసినది కానీ లేకపోయినా ఒక్క సామాన్య రాజు(ద్వారకకు) లాగా నేను చేయవలసిన పనులను చేస్తూనే ఉంటాను, అలా చేయకపోతే లోకాలు నాశనమయి జరిగే అల్లకల్లోలానికి భాద్యుడనయి మానవ జాతికి శాంతి లేకుండా పోతుంది.
ఓ భారతవంశీయుడా! అజ్ఞానులు కర్మ ఫలములయందు ఆసక్తి/ మమకారముతో తమ విధులను నిర్వర్తించినట్లుగా జ్ఞానులు కూడా, లోకానికి మార్గదర్శకం (స్థితప్రజ్ఞుల లాగా ) చేయడంకోసం తమ కర్మలను/విధులను/ పనులను/కర్తవ్యములను ఆచరించాలి.
జ్ఞానులయిన వారు అజ్ఞానములో ఉన్నవారిని కర్మలను/విధులను/ పనులను/కర్తవ్యములను చేయడం మాన్పించరాదు. అలా చేయడం వలన అజ్ఞానుల బుధ్ధి భ్రమకు గురి అవుతుంది. స్థితప్రజ్ఞులలాగా తమ కర్మలను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు స్ఫూర్తినివ్వాలి అని భోదించెను.
ఈ వార సారాంశము ఇంతటితో సమాప్తము.
11 నుండీ 26 శ్లోకముల గూర్చి మరింత సమాచారమూ మరిన్ని ఉదాహరణాలకొరకు Reference Book భగవద్గీత - భగవంతుని మధురవాణి స్వామి ముకుందానంద గారి వ్యాఖ్యానము తప్పక చదవండి.
మీ యొక్క సందేహముల జవాబు కొరకు, మరియూ భగవద్గీతను మరింతగా అర్థం చేసుకొనుటకు ప్రతి సోమవారం నుండి శుక్రవారం 7:30AM నుండి to 8:30AM వరకూ జరిగే భగవద్గిత సంభాషణలో భాగం వహించండి. అలా వీలు కానిచో వచ్చే వారం మళ్ళీ ఈ బ్లాగ్ ను చదవండి.
వచ్చే వారము:
స్వధర్మము మరియూ యజ్ఞము గూర్చి భగవాన్ శ్రీ కృష్ణుని భోధన విన్న అర్జునునికి ఎలాంటి సందేహము కలిగినది. అందుకు భగవంతుడు ఇచ్చిన సమాధానం ఏమిటి.
మనుషులు ఎందుకు అయిష్టముగా బలవంతముగా ఎదో శక్తి వెనుకనుండి చేయించినట్టు పాపములు చేయుటకు ప్రేరేపించబడుతారో మనం చర్చించుకుందాం.
సారాంశం: JKYog India Online Class- భగవద్గీత [తెలుగు]- 29 జూలై నుండి 1 ఆగస్టు 2024 వరకు